9, జూన్ 2019, ఆదివారం

*ఓ పవిత్ర స్మరణ*

【ఈ రోజు (జూన్ పది) పూజ్యులు, శివైక్య సద్గురు 'కందుకూరి శివానంద మూర్తి' గారి వర్ధంతి  సందర్భంగా...】

సద్గురు కందుకూరి శివానంద మూర్తి గారు సాధారణ జీవితం గడిపిన గృహస్థ సాధువు. ఆ రోజుల్లోనే ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి తమదైన సమాజ సేవకు అంకితమయ్యారు. సంపద సృష్టించడం, ఉపాధి కల్పించడం, వైజ్ఞానిక విప్లవం తీసుకురావడం మొllవంటివి మాత్రమే సమాజ సేవలు అనుకుంటే పొరపాటు. ధర్మాన్ని తెలపటం తద్వారా మానవీయ  నైతిక విలువలు  దెబ్బతినకుండా చూడటం, ఙ్ఞాన వైరాగ్యాల పట్ల  జిజ్ఞాసను  కలిగించడం తద్వారా అనవసర విషయాలపై వెంపర్లాటకు లోనుకాకుండా ప్రజల్లో చైతన్యం తేవడం వంటివి కూడా అత్యుత్తమ సమాజ సేవలే. సద్గురు శివానంద మూర్తిగారు చేసిన ఈ తరహా సమాజ సేవ మనఃవందనీయం.
ఇల్లు, సంసారం, పిల్లలు వీటిని తలకు మించిన భారంగా భావించే వారికి వీరి జీవనవిధానం ఒక మేలుకొలుపు. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ తమ పిల్లలను పదిమందికి పనికొచ్చే మంచి పౌరులుగా తీర్చిదిద్దారు శివానంద మూర్తిగారు. రకరకాల భారాలను మానసికంగా మోస్తూ కూడా ప్రసన్నవదనంతో సౌమ్యంగా ప్రవర్తించేవారు సద్గురు. వ్యక్తిగత సుఖాలను త్యాగం చేసి వీరిని  విశ్వసించిన సమాజ సమూహానికి సుఖ ప్రదమైన జీవితాన్ని అవలంబించుకునేలా మార్గనిర్దేశం చేశారు.  స్వధర్మాన్ని, సనాతన హైందవ ధర్మాన్ని తమవంతు బాధ్యతగా సుబోధ చేశారు. గుండెలకు హత్తుకునేలావుండే  మృదువైన మితభాషతో అమిత విషయపరిజ్ఞానాన్ని ప్రబోధించేవారు. వీరి నిర్మలమైన మనసును,  ఙ్ఞాన సంపదను గుర్తించిన అనుగాములు దైవంగా తలచి  సద్గురువని భావించేవారేగాని  శివానంద ముర్తిగారు తమకైతాము  ఎన్నడూ దైవంగా ప్రకటించుకోలేదు సరికదా గురువుగా కూడా ప్రకటించుకోలేదు. కేవలం హితబోధ ద్వారానే కాకుండా తమ నడవడికద్వారా కూడా ఆదర్శాలకు నిదర్శనంగా నిలిచారు సద్గురు.
     
ఇది రచన కాదు...
సద్గురునిపై  కృతజ్ఞతతో నివేదించిన
నా హృదయ స్పందన...
ఓ పవిత్ర స్మరణ...9052116568  ప్రహ్లాద్ నెల్లుట్ల    రచయిత సినీరంగం
         
                          -ప్రహ్లాద్


🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి